'ఉద్యోగ మిత్ర'గా వేముల ప్రకాష్ - Udyogamitra Vemula Prakash
TBUZZ7:15 AMNirudyogula Sevakudu, Prakash Vemula, Samacharapu Gadi Teachersbadi, Teachersbadi.In, Udyogamitra, Vemula Prakash
No comments

'ఉద్యోగ మిత్ర'గా వేముల ప్రకాష్ - Udyogamitra Vemula Prakash..
వృత్తిపరంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు... సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకొని ఖాళీ సమయంలో పదుగురికి సేవ చేయాలన్న తపనతో ప్రవృత్తిని అలవర్చుకొని ఓ వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ఆన్‌లైన్‌లో ఉద్యోగులు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులకు విలువైన సమాచారాన్ని అందిస్తున్నాడు వేముల ప్రకాశ్.
ఆయన చదివింది డిగ్రీ. విద్యార్థి దశలో తన తండ్రి నుంచి టీవీ మెకానిజంలో మెళకువలు నేర్చుకున్నాడు. ఖాళీ సమయంలో ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పదిమందికి విలువైన సమాచారాన్ని అందించడం అలవాటుగా మార్చుకున్నాడు. తనకు తెలిసిన తాజా విషయాలను ఆన్‌లైన్‌లో పది మందికి చేరవేరుస్తూ ఏడాది కాలంలోనే తాను రూపొందించిన వెబ్‌సైట్‌ను నిత్యం 10 నుంచి 15వేల మంది వీక్షించే రీతిలో సమాచారాన్ని అందజేస్తూ అటు పని చేసే పాఠశాలలో కూడా విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.
ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్‌జీటీగా పని చేస్తున్న వేముల ప్రకాశ్ స్వగ్రామం పెద్దవంగర మండలం అవుతాపురం. ఈయన తల్లిదండ్రులు సరోజన - లక్ష్మణ్. లక్ష్మణ్ కొన్నేళ్ల క్రితమే తొర్రూరుకు వచ్చి స్థిరపడి టీవీ మెకానిజం చేస్తూ ప్రకాశ్‌ను ఉన్నత చదువులు చదివించాడు.
విద్యాబ్యాసం:
a. 7వ తరగతి వరకు అవుతాపురంలోనే చదివిన ప్రకాశ్
b. 8నుంచి 10వ తరగతి ఏపీఆర్‌ఎస్ దౌలతాబాద్,
c. తొర్రూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్,
d. జనగాం ఏబీవీ కళాశాలలో డిగ్రీ,
e. హన్మకొండలో టీటీసీ,
d. సిద్దిపేటలో బీఈడీ విద్యను పూర్తి చేసి 2002 డీఎస్సీలో ఎస్‌జీటీ ఉద్యోగం పొందారు.
చదువుకున్న రోజుల్లోనే టీవీ మెకానిజాన్ని తండ్రి నుండి నేర్చుకొని ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తరువాత ఇంటర్‌నెట్‌పై దృష్టి సారించాడు.
టీచర్స్ బడి వెబ్‌సైట్ ద్వారా సేవల విస్తరణ...
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో డిసెంబర్ 2012 లో ప్రమాదవశాత్తు ప్రకాశ్ కుడి కాళీ మడమ దగ్గర fracture అయినది. డాక్టర్‌లు సుమారు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఇంటి వద్ద ఖాళీగా కూర్చున్న సమయంలో తనకున్న ఇంటర్‌నెట్ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఉపాధ్యాయ, ఉద్యోగులకు సంబంధించిన ఉత్తర్వులను చూడటం మొదలు పెట్టాడు.
ఆ సమయంలోనే వేల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులకు, నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఇంటర్‌నెట్ ద్వారా ఒకే చోట అన్ని రకాల సమాచారాన్ని సరళంగా అందించే రీతిలో స్వతహాగా ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని ఆలోచన చేశారు. జూన్ 2, 2013లో ఆయన ఆలోచనకు కార్యరూపం దాల్చుతూ TeachersBADI.In అనే వెబ్‌సైట్‌ను రూపొందించాడు. అధికారికంగా వెబ్‌సైట్ టీచర్స్ బడి నామకరణం చేసి ఆన్‌లైన్‌లో .in డొమైన్‌ను కొనుగోలు చేసి వెబ్‌సైట్ నామకరణాన్ని చేపట్టారు.
విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం...
తన వద్ద నున్న కంప్యూటర్స్ తో .. ప్రకాశ్ పని చేస్తున్న పాఠశాలలో విద్యార్థులకు డీజీ స్కూల్ వాతావరణాన్ని కల్పిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్ త్రీడీ రైమ్స్‌ను ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఒకటి నుంచి 3వ తరగతి విద్యార్థులకు చూపించడం, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందజేయడం, వీడియో పాఠాలు చూపిస్తూ సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంచడం వంటి కార్యక్రమాలను వేముల ప్రకాశ్ నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం, విద్యా శాఖ నుంచి వెలువడిన మార్గదర్శకాలను, ఉత్తర్వులను, ప్రభుత్వ జీవోలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడం, వేతన పంపిణీ, విడుదల (డీడీఓ)లకు సంబంధించిన సమాచారాలను పొందుపర్చడం, ఉద్యోగులకు సంబంధించిన వేతన వివరాలు, జీపీఎఫ్ వివరాలు, ఏపీజీఎల్‌ఐ వంటి వివరాలను ఆ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంటారు.
విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్‌లు, పోటీ పరీక్షల వివరాలు, పరీక్షల ఫలితాలు, హాల్ టికెట్లు, ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎలాంటి కోర్సులు చేయవచ్చు, ఎవరిని సంప్రదించాలన్న వివరాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపర్చడంతో పాటు ఆన్‌లైన్‌లో ఏ విధంగా అప్లికేషన్ ఫాంలను పూర్తి చేయాలో యూజర్‌గైడ్ ద్వారా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాడు.
కేటగిరీల వారీగా జీవోలు, ఉత్తర్వులు, జాబ్స్,ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అడ్మిషన్స్, నోటిఫికేషన్స్ పొందుపర్చి యూజర్స్ ఫ్రెండ్లీగా వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ప్రస్తుత సాంకేతిక యుగంలో వేలాది మంది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లను వినియోగిస్తూ నెట్ సౌకర్యాన్ని కలిగి ఉండటం వలన వెబ్‌సైట్ యొక్క తాజా సమాచారాలను సోషల్ నెట్‌వర్క్(ఫేస్‌బుక్, గూగుల్‌ప్లస్, ట్విట్టర్, లింక్‌డ్ ఇన్)ల ద్వారా పొందే విధంగా రూపకల్పన చేశారు.
వెబ్‌సైట్‌లో ఉంచిన అంశాలకు సంబంధించి ఎవరైనా సందేహాలు లేదా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్‌ను వినియోగించుకునేలా సౌకర్యాన్ని కల్పిస్తూ అనుభవజ్ఞులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావుల అభిప్రాయాలను తీసుకొని వాటిని క్రోడీకరిస్తూ సమాచారానికి మెరుగులు దిద్దుతున్నారు. తక్షణ సమాచారాన్ని ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా ఇతరులకు పంపేందుకు ఇన్‌బాక్స్‌లో ఫాలో బటన్‌ను రూపొందించాడు. దీని ద్వారా సెకన్లలో సమాచారం పొంది ఇతరులకు చేరవేసే విధంగా ఏర్పాట్లు చేయడంతో ప్రతీ రోజు 10 నుంచి 15వేల మంది ఈ వెబ్‌సైట్‌ను వినియోగించుకుంటున్నారు.